Hindi Controversy
‘పదవీ వ్యామోహాలు కులమత భేదాలు/ భాషాద్వేషాలు చెలరేగే నేడు/ ప్రతి మనిషి మరియొకని దోచుకొనేవాడే/ తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనేవాడే’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. కుల, మత, భాషా, సాంస్కృతికంగా వైవిధ్యభరితమైన దేశం మనది. భాష… జీవ, భౌతిక, సామాజిక, మనో వైజ్ఞానిక లక్షణాల సమాహారం. భిన్న భాషలు, భిన్న కులాలు, విభిన్న సంస్కృతులను ఐక్యం చేసే ఏకాత్మ మన భారతీయత. ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు, ఏకాత్మ మూల వేరును పెకలించేందుకు మతోన్మాద శక్తులు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. 2025 నాటికి భారత్‌ను హిందూ రాష్ట్రగా మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాలో భాగమే బిజెపి తెరపైకి తెచ్చిన త్రిభాషా సూత్రం. దేశ వైవిధ్యాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా… దేశవ్యాప్తంగా హిందీ అమలు కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. ”హిందీ, హిందూ, హిందుస్థాన్” వంటి ఆర్‌ఎస్‌ఎస్ దృష్టి కోణాన్ని రుద్దడం ఆమోదయోగ్యం కాదు’ అని సీతారాం ఏచూరి గతంలోనే చెప్పారు. ‘దేశంలో అనేక భాషలున్నాయని, ఒకే భాషను దేశభాషగా పేర్కొనలేమని, ఉన్నత విద్యాసంస్థల్లో హిందీని ప్రధాన బోధనా భాషగా నిర్వహించలేమని’ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టంగానే చెప్పారు. అయినా… బిజెపి సామ దాన బేధ దండోపాలయాలను ప్రయోగిస్తూనే వుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి హిందీ యేతర భాషలు మాతృభాషగా గలవారి సంఖ్యే ఎక్కువ. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ అధికారికంగా గుర్తించిన 22 భాషల్లో హిందీ కూడా ఒకటి. అంతకు మించి హిందీకి ఎటువంటి ప్రత్యేకతనూ రాజ్యాంగం కల్పించలేదు. మరి హిందీకి కామన్ లాంగ్వేజ్ హోదా ఎప్పుడు వచ్చిందో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. ఇలాంటి ప్రమాదాన్ని ముందే ఊహించిన రాజ్యాంగ నిర్మాతలు…8వ షెడ్యూల్‌లో 14 భాషలను చేర్చారు. ఇవి తర్వాత 22కు చేరాయి. అనుసంధాన భాషగా ఇంగ్లీష్‌ను కొనసాగించారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక అవసరాలను తీర్చేదిగా హిందీని అభివృద్ధి చేయాలని అంటూనే సంస్కృతీకరించేందుకు పూనుకున్నారు. ‘కాలం చెల్లిన సంస్కృతంతో హిందీని సజీవం చేయాలనుకోవడం మొరటు ప్రయత్నం’ అని భాషా నిపుణులు చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి హిందీ రాష్ట్రాల్లో అవధి, భోజ్‌పురి, మైథిలి, మగధ వంటి భాషలు మాట్లాడేవారే అధికం. ఈ భాషల్లో సుసంపన్నమైన సాహిత్యం విలసిల్లింది. ‘రామ్‌చరిత మానస్’ను తులసీదాస్ అవధి భాషలోనే రాశారు. ఇలాంటి సాహితీ సంపద కలిగిన భాషలన్నిటినీ హిందీలో కలిపేశారు. అయినా…హిందీ యేతర భాషలు మాట్లాడేవారు 60 శాతం పైగా వుండటం గమనార్హం. అయినా, హిందీని రాష్ట్రాలపై రుద్దుతూ పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన చేయడమంటే, దేశ వైవిధ్యంపై ప్రత్యక్ష దాడికి పూనుకోవడమే.
గతంలో స్థానిక భాషలతో పాటు ‘కర్డ్’ అన్న ఆంగ్ల పదానికి బదులుగా ‘దహీ’ అన్న హిందీ పదం వాడాలని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఆదేశించడం…హిందీని బలవంతాన రుద్దడమేనని తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ‘నహీ టు దహీ’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చాయి. తాజాగా జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపి)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. ఎన్‌ఈపి పేరుతో తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకే ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని తమిళనాడు గట్టిగా చెబుతోంది. స్థానిక మాతృభాషతో పాటు హిందీని అధికారిక భాషగా గుర్తించడం వల్ల స్థానిక యువతకు ఒరిగేదేమీ లేదని, మారుతున్న ప్రపంచానికి ఆంగ్లభాష అవసరం గురించి అన్ని రాష్ట్రాలూ చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలోని విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర భయాందోళనలతో వున్నారు. యువతకు నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నమూ సమాజానికి మేలు చేయదని విశ్లేషకులూ చెబుతున్నారు. గతంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల నుంచి బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుంటే దేశ ఐక్యతకు, భారతీయత బలోపేతానికి మార్గం సుగమం అవుతుంది. లేదంటే… దేశంలో భాషా బేధాలు తలెత్తే అవకాశం వుంది.
Comments
Post a Comment