Delimitation Challenges to federal regime - P Chidambaram
Delimitation Challenges to federal regime
సమాఖ్య పాలనకు పునర్విభజన సవాళ్లు
ABN , Publish Date - Mar 09 , 2025 | 05:53 AM
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, 1977లో రాజ్యాంగానికి 42వ సవరణ జరిగిన నాటి నుంచి, రాష్ట్రాల మెడపై ఒక కత్తిలా వేలాడుతోంది. రాజ్యాంగ అధికరణలు 81, 82 తేటతెల్లమైన భాషలో సుబోధకంగా ఉన్నాయి: ‘ఒక పౌరుడు, ఒక ఓటు’ అనే సూత్రాన్ని...
సమాఖ్య పాలనకు పునర్విభజన సవాళ్లు
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, 1977లో రాజ్యాంగానికి 42వ సవరణ జరిగిన నాటి నుంచి, రాష్ట్రాల మెడపై ఒక కత్తిలా వేలాడుతోంది. రాజ్యాంగ అధికరణలు 81, 82 తేటతెల్లమైన భాషలో సుబోధకంగా ఉన్నాయి: ‘ఒక పౌరుడు, ఒక ఓటు’ అనే సూత్రాన్ని అవి చేర్చుకున్నాయి. లోక్‌సభ సభ్యుల సంఖ్య వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా ఎన్నికయ్యే సభ్యులు 530కి మించకూడదని, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్నుకునే వారి సంఖ్య 20కి మించకూడదనే పరిమితులను రాజ్యాంగ అధికరణ నిర్దేశించింది. లోక్‌సభలో ప్రస్తుతం రాష్ట్రాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైనవారు 13 మంది ఉన్నారు. అధికరణ 81లోని నిబంధన 2(ఎ) ఇలా ఉంది: ‘ప్రతి రాష్ట్రం నుండి లోక్‌సభకు ఎంతమంది ఎన్నిక కావాలనే విషయం ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. జనాభాకు, లోక్‌సభ సభ్యుల సంఖ్యకు గల నిష్పత్తి సాధ్యమైనంతవరకు అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలి’. ఈ అధికరణానికి సంబంధించి ‘జనాభా’ అంటే ఆఖరుసారిగా జనాభా లెక్కలు జరిగి, అధికారికంగా ప్రకటించబడిన జనాభా అని అర్థం.
అధికరణ 81 ప్రకారం ప్రతి జనాభా గణన అనంతరం ఒక రాష్ట్రానికి కేటాయించే సీట్ల సంఖ్యను పునర్ నిర్ధారించవలసి ఉన్నది. అయితే ఈ ప్రక్రియకు 2026 సంవత్సరం దాకా విరామం పాటించాలి. ఈ కారణంగా వివిధ రాష్ట్రాలకు కేటాయించిన సీట్ల సంఖ్యను 1971 జనాభా గణన ననుసరించి నిర్ధారించిన రీతిలో స్తంభింపచేశారు. ఇది ‘ఒక పౌరుడు, ఒక ఓటు’ అనే సూత్రాన్ని ఉల్లంఘించడమే.
‘ఒక పౌరుడు, ఒక ఓటు’ అనేది ప్రజాస్వామ్య మౌలిక సూత్రం అనడంలో సందేహం లేదు. అయితే 1776లోనే అమెరికన్లు గ్రహించినట్లుగా అది సమాఖ్య సూత్రానికి విరుద్ధమైనది. ఈ వైరుధ్యానికి వారు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. అది గత 250 సంవత్సరాలుగా వారికి బాగా ప్రయోజనకరంగా ఉన్నది.
వారు నిర్దిష్ట కాల వ్యవధుల్లో మొత్తం 50 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి కాంగ్రెస్ దిగువ సభ ప్రతినిధుల సభలో కేటాయించే సీట్ల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా సంఖ్య ప్రాతిపదికన పునర్ నిర్ధారిస్తూ వస్తున్నారు. అయితే ఎగువసభ సెనేట్‌లో ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం (ఇద్దరు సభ్యుల చొప్పున) కల్పిస్తున్నారు. అమెరికా వలే భారత్ కూడా ప్రజ్యాస్వామ్య వ్యవస్థ, సమాఖ్య రాజ్యం. 1971లోని జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడం వల్ల ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయనే వాస్తవాన్ని గుర్తించాము. అయితే ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి బదులు దాన్ని 2026 దాకా వాయిదా వేశాము. చివరి జనాభా గణన 2011లో జరిగింది. తదుపరి జనాభా గణన 2021లో జరగవలసి ఉండగా కోవిడ్ విలయం వల్ల వాయిదా వేశారు. 2021 నుంచి ఏదో ఒక సాకుతో జనాభా గణన జరగనే లేదు. 2026లో జనాభా గణన అనంతరం విధిగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగవలసి ఉన్నది. ప్రతి రాష్ట్రానికి కేటాయించే సీట్ల సంఖ్యను కూడా నిర్ణయిస్తారు. జనాభా పెరుగుదల అదుపులేకుండా జరిగినందుకు కొన్ని రాష్ట్రాలకు ప్రయోజనాలు కల్పిస్తారు. సంపూర్ణ ప్రజనన రేటు 2 శాతం, అంతకంటే తక్కువగా ఉండాలన్న నిర్దేశిత లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రాలను సీట్ల కుదింపుతో శిక్షించనున్నారు.
పునర్విభజన, సీట్ల పునర్ నిర్ధారణతో దక్షిణాది రాష్ట్రాలు అమితంగా నష్టపోతాయి. వాటి మొత్తం సీట్ల సంఖ్య 129 నుంచి 103కు తగ్గిపోనున్నది. జనాభా నిష్పత్తి సూత్రానికి అనుగుణంగా రాష్ట్రాలకు సీట్ల సంఖ్యను పునర్ నిర్ధారించడమంటే జననాల రేటును తగ్గించి జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలను ‘శిక్షించడమే’ అవుతుంది. జనాభా నియంత్రణ అనేది గత అర్ధ శతాబ్దిగా, ఇప్పటికీ కూడా, మన జాతీయ లక్ష్యంగా ఉందన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇప్పుడు లోక్‌సభలో 129 స్థానాలున్నా దక్షిణాది రాష్ట్రాల వాణి పెద్దగా విన్పించడం లేదు. మరి ఆ సీట్ల సంఖ్య మరింతగా తగ్గితే దక్షిణాది ప్రతినిధుల మాటను కేంద్రం శ్రద్ధగా పట్టించుకుంటుందా? దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గించబోమనే హామీ నిరర్థకమైనది. జనాభా అత్యధికంగా ఉన్న యూపీ, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల సీట్ల సంఖ్యను పెంచబోమని కేంద్రం హామీ ఇవ్వకపోవడం గమనార్హం. సీట్ల సంఖ్య పునర్ నిర్ధారణకు జనాభా నిష్పత్తి సూత్రాన్ని అనుసరించిన పక్షంలో దక్షిణాది రాష్ట్రాల బలం మరింతగా తగ్గిపోతుంది. పర్యవసానంగా వాటి సమస్యల పరిష్కారం పట్ల ఉపేక్ష మరింతగా పెరుగుతుంది. సీట్ల సంఖ్య పునర్ నిర్ధారణలో కొన్ని రాష్ట్రాలకు సీట్ల సంఖ్యను కుదించకపోవడమూ, కొన్ని రాష్ట్రాల సీట్ల సంఖ్యను పెంచడమూ జరగాలంటే లోక్‌సభకు ఎన్నికయ్యే ప్రతినిధుల సంఖ్యను విధిగా పెంచవలసి ఉంటుంది. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే కాబోలు లోక్‌సభ కొత్త భవనాన్ని 888 మంది సభ్యులకు సరిపోయే విధంగా రూపకల్పన చేసి నిర్మించారు. ఇది ఒక విధంగా ‘ఒక పౌరుడు, ఒక ఓటు’ సూత్రానికి కట్టుబడి ఉన్నందుకు చెల్లిస్తున్న భారీ మూల్యం. అలాగే జననాల రేటును తగ్గించి, జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలకు లోక్‌సభలో సీట్ల సంఖ్యను తగ్గించడం కూడా ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు.
జననాల రేట్లు తక్కువగా ఉన్న రాష్ట్రాలు లోక్‌సభలో ప్రభావశీలత పరంగా నష్టపోతాయి; జననాల రేట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి. ఒకవైపు అధికరణలు 81, 82 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన, ఆయా రాష్ట్రాల సీట్ల సంఖ్య పునర్ నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండడమూ, మరోవైపు జనాభా ప్రాతిపదికన పునర్విభజన, పునర్ నిర్ధారణకు దక్షిణాది రాష్ట్రాలు ససేమిరా అనడం కొనసాగిన పక్షంలో కేంద్రం, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలు తీవ్రమవుతాయి. వాటి పర్యవసానాలు మన సమాఖ్య వ్యవస్థకు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగల విజ్ఞతా వివేకాలు మనకు ఉన్నాయా?
పి. చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు
Comments
Post a Comment