దళితులు పట్టణాలకు తరలాలి - –డా.పసునూరి రవీందర్

 మార్జినల్ వాయిస్ - 10

ఇవాళ్టి తెలుగుప్రభ దినపత్రికలో నా వీక్లీ కాలమ్.
//దళితులు పట్టణాలకు తరలాలి//
‘‘యువత గ్రామాలకు తరలండి’’ అనే పిలుపుకు తెలుగునాట చాలా చరిత్ర ఉంది. ఆ పిలుపుకు ఆకర్షితులయ్యి యువత పెద్దమొత్తంలో అడవిబాట పట్టారు. ఆ క్రమంలోనే అకాల మరణాల పాలై, తమను నమ్ముకున్న కుటుంబాలకు తీరని అన్యాయం చేశారు. మరోవైపు తాము అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో 90వ దశకం తరువాత తెలుగునాట దళిత చైనత్యం ఎంతో పెరిగింది. చదువుకున్న యువత కారంచేడు,చుండూరు ఘటనల నేపథ్యంలో కులవ్యవస్థను గురించి తీవ్రంగా ఆలోచించింది. మన విముక్తి చదువుతో మాత్రమే సాధ్యమవుతుందని అందుకు అంబేద్కర్నే స్ఫూర్తిగా తీసుకున్నారు. అప్పటికీ విప్లవోద్యమంలో పని చేసిన దళితులకు అంబేద్కర్ కంటే మార్క్స్, మావోలే ఎక్కువ చేరువయ్యారు. అందుకు కారణం ఆ పార్టీల్లోని ఆధిపత్యకులాలకు చెందిన నాయకులే. వారే దళితులకు అంబేద్కర్ను అందకుండా చేసి, ఆయనను ఒక బూర్జువాగా ప్రచారం చేశారు. కేవలం బ్రిటీష్ పాలకులకు మెమోరాండాలు ఇచ్చిన నేతగా మాత్రమే చూశారు. అట్లా సదరు ఓసీ నాయకులు అంబేద్కర్ రచనలను గాని, ఆయన ఆలోచనలను గాని తెలుసుకోలేకపోయారు. ఇది దశాబ్దాల పాటు కొనసాగింది. దీంతో దళితులకు కూడా అంబేద్కర్ అందిరావడానికి కూడా చాలా కాలమే పట్టింది. ఇప్పటి దాకా కమ్యూనిస్టులకు అంబేద్కర్ పట్ల ఉన్న అభిప్రాయం సరైంది కాదని ఈ యాభై యేండ్ల కాలం తేల్చింది. అంతేకాదు అంబేద్కర్లోని దార్శనికతను అర్థం చేసుకోవాడనికి కూడా చాలా కాలమే పట్టింది. ఇదే సమయంలో అంబేద్కర్ను కనుగొన్న దళితులు ఆయన స్ఫూర్తితో చదువుల బాటపట్టారు. ఇది కమ్యూనిస్టులకు కంటగింపుగా కూడా మారింది. ఈ బూర్జువా చదువుల వల్ల ఉపయోగం లేదని మాటలు చెప్పి, పాటలు కూడా రాశారు. కానీ, ఆచరణలో మాత్రం చదువులే దళితుల బతుకుల్లో విముక్తిని కలిగిస్తాయని తేలింది. ఇదంతా నాణానికి ఒకవైపు.
భారత దేశంలో వేలయేండ్ల పాటు దళితులకు అన్ని హక్కులు నిరాకరించబడ్డాయి. మన ఆధునిక రాజ్యాంగం హక్కులు ప్రసాదించేవారకు దళితులకు చదువుకునే హక్కు, రాజ్యం చేసే హక్కు, ఆస్తి కూడబెట్టుకునే హక్క లేదు. మనుస్మృతి దళితులను మనుషులుగానే చూడలేదు. దీంతో అంటరానితనమనే చీకటిలోనే మగ్గారు. భారత దేశంలోకి ఆధునికత ప్రవేశించిన 19వ శతాబ్దం ఉత్తరార్థం నుండి పెద్దెత్తున చర్చ మొదలైంది. ఇంకెంత కాలం దళితులను ఇట్లా విద్యకు దూరం పెడతారనే ఆలోచన కొద్దిమంది బహుజన సంఘసంస్కర్తలు ఆలోచించారు. మహాత్మ జ్యోతిరావు 1882లో హంటర్ కమీషన్కు ఇచ్చిన నివేదికలో కూడా భారతదేశంలో ఎక్కువగా పాఠశాలలు పెట్టాలని కోరాడు. వాటిలో ఈ దేశంలో అణగారిన ప్రజలకు అవకాశం కల్పించాలని కోరాడు. ప్రాథమిక విద్యతో పాటు, ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను కూడా పటిష్టం చేయాలని సూచించాడు. సామాజిక న్యాయం కూడా కావాలని కోరాడు. దీనిని ఆనాడు ఎంతోమంది ఆధిపత్యకులాల వారు వ్యతిరేకించారు. పూలే మాత్రం దళితుల కోసం ప్రత్యేకంగా పాఠశాలలే పెట్టాడు. అట్లా సావిత్రిబాయి, జ్యోతిరావుపూలే దంపతులు చేసిన కృషి వల్లనే తొలితరం దళితులకు ఈదేశంలో అక్షర జ్ఞానం అందివచ్చింది. ఈ పరంపరలో భాగంగానే బాబా సాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదివి ఒక మార్గాన్ని వేశాడు. ఆ మార్గాన్ని అందుకోవడంలో నేటికీ దళితులు వెనకబడే ఉన్నారనేది నిర్వివాదమైన విషయం. అలాగే బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో దళితులు బాగుపడాలంటే పట్టణాలకు తరలాలని ఒక పిలుపును కూడా ఇచ్చారు. అందుకు కారణాలు స్పష్టంగానే ఉన్నాయి. గ్రామం అనేది కులంతో నిండి ఉన్న సమాజం. అక్కడ దళితులకు కనీస గౌరవం కూడా లభించదు. అసలు మనుషులుగానే చూడకపోవడం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు దళితులు తమ అభివృద్ధి కోసం పట్టణాలకు తరలాలి.
పేదరికమూ శాపమే!
దళితులు విశాలంగా ఆలోచించి, ఊరు దాటలేకపోవడానికి వారి ఆర్థిక పరిస్థితులు కూడా ఒక కారణమే. అందువల్లనే ఇప్పటికీ గ్రామాల్లో డ్రాప్ అవుట్ల రికార్డులను పరిశీలిస్తే, మధ్యలోనే చదువు మానేస్తున్న వాళ్లలో దళితులే ఎక్కవగా ఉన్నారు. అందుకు కారణం వారికి చదువు విలువ తెలియకపోవడం ఒక కారణం అయితే, చదువుకోవడానికి కావాల్సిన కనీస వసతులు లేకపోవడం మరో కారణం. దీంతో వారు చదువులు మధ్యలోనే మానేసి కూలినాలి పనులు చేసుకునేవారిగా మారుతున్నారు. చదువుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, వసతులు పాక్షికంగానే దళితులకు అందుతున్నాయి. చదువుకుంటే తమ జీవితాలు మారుతాయనే అవగాహన దళితుల్లో లేకపోవడం ఇప్పటికీ ఒక లోటుగానే ఉంది. వారికి చదువు వల్ల గెలిచిన విజేతల కథలు తెలియవు. చదువుకోవడం తమ కుటుంబాలకు ఎక్కడ భారంగా మారుతుందోనని ఒక భయం, ఆధిపత్యకులాలకు తమ పట్ల ఆగ్రహం కలుగుతుందోనని మరో దిగులు వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఫలితంగా ఎక్కువమంది దళితులు ఈ రెండు పరిస్థితులను అధిగమించలేక నిరక్షరాస్యుల జాబితాలో చేరుతున్నారు. పైగా దళితుల్లో చదువుకున్నవారు తమ జాతిని చదివించే పని పెట్టుకోవడం లేదు.
కులాధిపత్యాల పడగ నీడ!
దళితులు చదువుకుంటే తమ మాట వినరనే ఆలోచన ఆధిపత్యకులాల్లో ఉంది. అందుకే తెలంగాణలో యాభై యేళ్ల క్రితం ఊరికొక్క దళితుడు కూడా చదువుకునే వీలు లేని వాతావరణం కల్పించారు. ఎవరైనా చదువుకోవాలంటే ఊరొదిలి వెళ్లక తప్పని రోజులవి. తమ దగ్గర వెట్టి చేస్తూ జీవించాల్సిన వాళ్లు చదువుకుంటే తమ పనులు ఎవరు చేస్తారనే ఆలోచన ఓసీ కులాలకు సహజంగానే వచ్చింది. అందుకే వారు దళితుల చదువును ఏ మాత్రం అంగీకరించలేదు. ఎవరైనా దళితులు చదువుకుంటే బహిరంగ శిక్షలు విధించారు. ఇటీవల మెదక్ జిల్లాలో ఒక మాదిగ యువకుడు ‘‘మేం చదువుకున్నాం, ఇక చావుల కాడ డప్పులు కొట్టం”అన్నందుకు గ్రామ బహిష్కరణ చేశాయి ఆ ఊరి ఆధిపత్యకులాలు. దళితులు చదువుకోవడానికి పట్టణాలకు వెళ్తే ఊరి సేవ ఎవరు చేస్తారనేది ఓసీ కులాల మాట. అందుకే వారు కులవృత్తులు అలాగే ఉండి, తమకు సేవ చేసుకుంటూ దళితులు జీవించాలని కోరుకుంటారు. ఈ చట్రాన్ని దాటుకొని రావడం దళితులకు పెద్ద సవాల్గానే మారింది. దొరల ఆధిపత్యం వల్ల అక్షరాలకు దూరమైన అంటరాని బతుకులెన్నో ఉన్నాయి. పట్టణాల్లో తమ పిల్లలను గొప్ప చదువులు చదివించుకొని విదేశాలకు పంపిస్తారు ధనిక ఓసీ కులాలు. మరి అదే దళితులకు మాత్రం కనీసం ఇంటర్ డిగ్రీ కాదు, టెన్త్ పాసయ్యినా ఓర్వనితనం ఉంటుంది. ఈ వంకతోటే ఎంతోమంది మీద తెలంగాణ గ్రామాల్లో దాడులు కూడా జరిగాయి. వారి మైండ్సెట్లో మనువు తిష్టవేసుకుని కూర్చున్నాడు. కాబట్టి వారు కులవ్యవస్థ ప్రకారం దళితులు తమ కాళ్లకిందే ఉండాలని కోరుకుంటారు. వారిమైండ్సెట్ను మార్చే ప్రయత్నాలు ఏ కోశాన జరగకపోవడం ఈ దేశంలో ఒక మహా విషాదం.
ఉద్యమాల పాపం లేకపోలేదు!
ఏ ఉద్యమం ముందుకు వచ్చినా తప్పకుండా దళితుల భాగస్వామ్యం అందులో ఉండాల్సిందే. అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమైనా, మలి దశ తెలంగాణ ఉద్యమమైనా,ఆఖరికి విప్లవ, కమ్యూనిస్టు పార్టీల పోరాటాలైనా. అన్నింట్లో దళితులే తమ సర్వశక్తులు ఒడ్డాల్సిన అనివార్యతను ఈ ఉద్యమాలు కలుగజేశాయి. అందుకే దళితులు ఏ ఉద్యమం వచ్చినా దానిని ఆహ్వానించారు. తమ ప్రాణాలను, శక్తిని ధారపోశారు. ఆ ఉద్యమం సక్సెస్ అయితే తమ బతుకులు మారుతాయని బలంగా నమ్మారు. వీరి అమాయకత్వాన్ని ఆయా ఉద్యమాలు సొమ్ము చేసుకున్నాయి. ఇక రాజకీయ పార్టీల గురించి చెప్పాల్సిన పనే లేదు. కేవలం దళితులంటే వారికొక ఓటుబ్యాంకు మాత్రమే. దీంతో దళితుల జీవితాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. పైగా పవర్లేని పదవులు పంచి దళితులను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఫలితంగా ఉద్యమాలు దళితులకు మేలు చేయకపోగా నష్టమే ఎక్కువగా చేశాయన్నది కాదనలేని చేదు నిజం. అందుకు కారణం ఈ ఉద్యమాల్లో దళిత విముక్తి అన్నది ద్వితీయ ప్రాధాన్య అంశం. విప్లవోద్యమానికి వర్గ శత్రువు నిర్మూలనే ముఖ్యం. తెలంగాణ ఉద్యమానికి రాష్ర్ట సాధనే ముఖ్యం. బూర్జువ పార్టీలకు అధికారమే పరమావధి. అంతేతప్ప ఏ ఒక్కరు కూడా దళితులు బాగుండాలనే ఎజెండాను స్వీకరించలేకపోయారు. ఫలితంగా దళితులు వీరు జెండాలు మోసి భుజాలు, వీరి నినాదాలు ఇచ్చి గొంతులు మూలకు పడ్డాయి.
గ్రామాల్లో అనేక ఆటంకాలు...
దళితులు గ్రామాలలో ఎదగకుండా ఉండడానికి కులమూ, పేదరికంతో పాటు అనేక కారణాలూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో దళిత యువతను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య మద్యపానం. మద్యపానం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుందిగాని, దళితుల కుటుంబాలను మాత్రం కూల్చుతూనే ఉంటుంది. సరైనా విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించలేని ప్రభుత్వాలను తాగుడుకు బానిసలవుతుంటే నిశ్చేష్టులుగా చూస్తుంటాయి. తెలంగాణలో అందుకే అత్యంత ఎక్కువగా దళితుల్లోనే అకాల మరణాలు సంభవిస్తున్నాయి. దళితుల కుటుంబాలే కూలిపోతున్నాయి. అందుకే ఇప్పుడు దళిత యువత ఈ ఊబి నుండి బయటపడాలి.వారు ఉన్నతచదువులు చదవడానికి మహా నగరాలను ఎంచుకోవాలి. ఊరికి దూరంగా కొనసాగించే వారి చదువే వారికి బంగారు భవిష్యత్తును అందిస్తుంది. ఇది గుర్తించనంత కాలం గ్రామీణ ప్రాంత దళితులు అకాల మరణాల బారిన అంతమవుతూనే ఉంటారనేది గుర్తుంచుకోవాలి.
పట్టణాలూ సురక్షితమేనా?!
పట్నంలో పేద, మధ్యతరగతి వ్యక్తుల జీవితాలు కష్టాలతోనే ఈడ్చాల్సి ఉంటుంది. మరి ఇలాంటి చోట దళితులు ఎలా రాణించగలరు?అనేది ఆలోచించాల్సిన విషయం. కాకుంటే పట్నాల్లో విద్యా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల దళితులు తమ శక్తిమేరకు కృషి చేయాగలిగితే వారు తప్పకుండా ఒక గౌరవప్రదమైన జీవితాన్ని పొందగలుగుతారు. పైగా కులపీడన గ్రామాల్లో ఉన్నంత ఎక్కువగా పట్నాల్లో ఉండదు. ఇక్కడ అస్సలు లేదని కాదు. కార్పోరేట్ రెక్కలు ఎక్కి విశ్వ నగరంగా మారినా సరే పట్నాల్లో కులం వెర్రి తలలు వేస్తూనే ఉంటుంది. కాకుంటే గ్రామ బహిష్కరణలు ఉండవు. తమ తాతలు, తండ్రులు పడ్డ కష్టాలు పడకుండా ఉండేందుకు పట్నం ఒక వెసులుబాటును ఇస్తుంది. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ దళితులను పట్నాలకు తరలమన్నాడు. ఇవాళ బాగుపడ్డ ఏ దళితుడికైనా పట్నమే ఆవాసమై ఉంటుంది. అంతేతప్ప కులకంపు కేంద్రమైన గ్రామం కాదు. వెలివేతలు, వివక్షలు, దాడులు, దౌర్జన్యాల గ్రామ స్వభావాన్ని భరించే దళితుల్లో ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే అంబేద్కర్ మార్గంలో దేశ విదేశాల్లో దళితులు చదువుకొని రాణించాలి. అందుకు ఊరు వదిలిపెట్టడమే శరణ్యం!
–డా.పసునూరి రవీందర్
రచయిత, సామాజిక విశ్లేషకుడు
77026 48825

Comments

Popular posts from this blog

Chenchulu of Nallamala

Gujarati financial influence on the Indian economy

Row over CPI(M) not calling Modi govt ‘fascist’; Vijayan eyeing ‘BJP vote’: Cong