Opposition MPs Protest Against Voter List

 

Opposition MPs Protest Against Voter List: కదం తొక్కిన విపక్షం

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:04 AM

ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కదం తొక్కారు. బిహార్‌లో ఓటర్ల

Opposition MPs Protest Against Voter List: కదం తొక్కిన విపక్షం

  • ఓట్ల చోరీ, ఎస్‌ఐఆర్‌పై 300 మంది ఎంపీల నిరసన

  • పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి.. ఇండియా కూటమి ఎంపీల భారీ నిరసన ప్రదర్శన

  • ర్యాలీలో పాల్గొన్న లోక్‌సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు

  • మధ్యలోనే అడ్డుకుని నిర్బంధించిన ఢిల్లీ పోలీసులు

  • బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపిన మహిళా ఎంపీలు

  • పోలీసులతో వాగ్వాదం.. తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత

  • రాహుల్‌, ఖర్గే, ప్రియాంక సహా పలువురు నేతల అరెసు

న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కదం తొక్కారు. బిహార్‌లో ఓటర్ల జాబితా విస్తృత సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని, దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ.. సోమవారం నిరసన చేపట్టారు. పార్లమెంట్‌ భవనం నుంచి ఈసీ కార్యాలయం దాకా ఎంపీలు ప్రదర్శన చేపట్టగా.. వారిని ఢిల్లీ పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకొని నిర్బంధించారు. ఈ క్రమంలో పోలీసులు, ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు నేతలు బారికేడ్లు ఎక్కి ముందుకెళ్లే యత్నం చేయడం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు మహిళా ఎంపీలు కళ్లుతిరిగి పడిపోయారు. ఎంపీల శాంతియుత నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు నేతలు మండిపడ్డారు. సోమవారం ఉదయం పార్లమెంట్‌ సమావేశం కాగానే.. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను రద్దు చేయాలి.. ఓట్ల చోరీని నిలిపివేయాలి అని నినాదాలు చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభలను స్తంభింపజేశారు. దీంతో సభలు వాయిదా పడ్డాయి. అనంతరం ఉభయ సభలకు చెందిన దాదాపు 300 మంది ఇండియా కూటమి ఎంపీలు అక్కడి నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి ప్రదర్శనగా బయలుదేరారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ ప్రియాంకగాంధీ, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్‌, ఎన్సీపీ-ఎస్పీ నేత శరద్‌పవార్‌, శివసేన నేతలు సంజయ్‌ రౌత్‌, ప్రియాంక చతుర్వేది, డీఎంకే నేత టీఆర్‌ బాలు, తృణమూల్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ సహా ఆర్జేడీ, లెఫ్ట్‌, ఆప్‌ నేతలు సైతం ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్‌ కుమ్మక్కై బీజేపీని గెలిపిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్‌ మకర ద్వారం నుంచి బయలుదేరి ప్రదర్శనగా వెళుతుండగా.. పోలీసులు అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

gdn.jpg

బారికేడ్లు ఎక్కి నినాదాలు..

సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, మహిళా ఎంపీలు మహువా మోయిత్రా, సంజనా జాదవ్‌, జ్యోతిమణి, ఎన్సీపీ నేత సుప్రియా సూలే.. బారికేడ్ల పైకెక్కి ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకగాంధీ.. నిరసన జరిగినంతసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ వాద్రా, అఖిలేశ్‌ యాదవ్‌, సంజయ్‌ రౌత్‌, ప్రియాంక చతుర్వేది సహా పలువురిని పోలీసులు బస్సుల్లోకి ఎక్కించి పార్లమెంట్‌ వీధిలో ఉన్న పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత కొద్దిసేపటికి విడుదల చేశారు. కాగా, 30 మంది ఎంపీలను కలుసుకునేందుకు మాత్రమే ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చిందని, కానీ.. 200 మందికి పైగా నేతలు ర్యాలీలో పాల్గొన్నారని డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ దేవేశ్‌కుమార్‌ మహా తెలిపారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వారిని నిలువరించి నిర్బంధించాల్సి వచ్చిందన్నారు. బారికేడ్లు దాటి ముందుకెళ్లే ప్రయత్నంలో పోలీసులతో ఘర్షణ పడిన తృణమూల్‌ ఎంపీలు మహువా మోయిత్రా, మిథాలీ బాగ్‌ స్పృహ తప్పి పడిపోయారు. వారికి రాహుల్‌గాంధీ సాయం అందించడంతో మహువా తేరుకున్నారు. మిథాలీ తేరుకోకపోవడంతో ఆమెను లోహియా ఆస్పత్రికి తరలించారు.

రాజకీయ యుద్ధం కాదు..

తమది రాజకీయ పోరు కాదని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న యుద్ధమని రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో ఓట్లను కొల్లగొట్టి బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తున్న తీరుపై తాము పోరాడుతున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్‌తో తాము మాట్లాడలేకపోతున్నామనేది వాస్తవమని, తమకు స్వచ్ఛమైన, నిజమైన ఓటర్ల జాబితా కావాలని డిమాండ్‌ చేశారు. ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న దానిపై తాము పోరాడుతున్నామని, వాస్తవాలను దేశ ప్రజలకు తెలియజేశామని పేర్కొన్నారు. కాగా, ఓట్ల చోరీపై తాము శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో తెలియడం లేదని ఖర్గే అన్నారు. మరోవైపు రాహుల్‌గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల కమిషన్‌ జవాబు ఇవ్వకుండా.. ప్రమాణం చేయడాలనడం విడ్డూరమని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. పోలీసులతో నిర్బంధించడం ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. 

Updated Date - Aug 12 , 2025 | 04:04 AM

Comments

Popular posts from this blog

Chenchulu of Nallamala

Gujarati financial influence on the Indian economy

Row over CPI(M) not calling Modi govt ‘fascist’; Vijayan eyeing ‘BJP vote’: Cong