Electoral Roll Revision Controversy (AP)
Gutta Rohit
2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు అని కొంతమంది లబలబలాడిపోతున్నారు. ముందుగా రాజకీయ కారణాలు చెప్పుకోవచ్చు.
మహారాష్ట్ర, కర్ణాటక లో కాంగ్రెస్ ఒక ముఖ్య పార్టీ. అధికార/ప్రతిపక్ష స్థాయి పార్టీ. బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో విపక్ష కూటమిలో ఒక పార్టీ. తమకి మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యం కాబట్టి వాటి గురించి తరుచూ మాట్లాడుతుంది. అలాగే ఉత్తర్ ప్రదేశ్ సమాజ్వాదీ పార్టీకి ముఖ్యం కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. బీహార్ రాష్ట్రీయ జనతా దళ్, సిపిఐ (ఎం-ఎల్)(లిబరేషన్) పార్టీలకి ముఖ్యం కాబట్టి వాళ్ళు ఎస్ఐఆర్ మీద చాలా పని చేస్తున్నారు. ఈ లెక్కన ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడవలసింది ఎవరు? లబలబలాడుతున్నవారు ఈ ప్రశ్న వేసుకుంటే మంచిది.
ఇక రెండవది, మాట్లాడటానికి ఇక్కడ విషయం ఉందా? వాట్ డు నంబర్స్ హేవ్ టు సే? తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు వేరు వేరుగా జరుగుతాయి. ఒక సంవత్సరం తేడాలో. అంటే ఒకే సంవత్సరంలో రెండు సార్లు ఓటర్ల జాబితాని తయారు చేయాలి. మహారాష్ట్రలో 2024 పార్లమెంట్ ఎన్నికల ఏప్రిల్/మే నెలలలో జరుగగా, అదే సంవత్సరం నవంబర్ లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. అక్కడ 2019 నుండి 2024 మధ్య 39 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు కాగా, ఈ ఐదు నెలలలోనే దాదాపుగా 41 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. అది అసాధ్యం అని, అక్కడే అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని, పార్లమెంట్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించిన తమకి, శాసనసభ ఎన్నికలలో అన్ని తక్కువ సీట్లు రావటానికి ఇది కారణం అని కాంగ్రెస్ ఆరోపణ. దానికి ఎన్నికల కమీషన్ ఇప్పటివరకు ఎటువంటి జవాబు ఇవ్వలేదు అనేది వేరే విషయం.
ఇక కర్ణాటకలో మహదేవపుర విషయం తెలిసిందే. 2023 మే నెలలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు, 2024 ఏప్రిల్/మే నెలలలో పార్లమెంట్ ఎన్నికల మధ్య ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 52000 మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. అంటే ఒక్క సంవత్సరంలోనే 52000 మంది. అంటే ఒక్క సంవత్సరంలోనే 8.5% పెరుగుదల. లేదా 2018 నుండి చూసుకుంటే, 2018 నుండి 2024 మధ్య ఈ ఒక్క నియోజకవర్గంలోనే సుమారుగా ఒక లక్ష తొంభై వేల మంది కొత్త ఓటర్లు చేరారు. అంటే సంవత్సరానికి సుమారుగా 7% పెరుగుదల. ఇది ఐటి ప్రాంతం కాబట్టి, మిగతా చోట్ల కంటే ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువే. అయితే ఈ స్థాయిలోనా అనే ప్రశ్న మాత్రం అలాగే ఉంది? అందుకే అందులో అక్రమాల జరిగాయని రాహుల్ గాంధీ తన పత్రికా సమావేశంలో ఆధారాలు అందచేశారు.
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వద్దాం. ఇక్కడ ఎప్పటినుండో జమిలీ ఎన్నికల వ్యవస్థ. ఇక్కడ అందుబాటులో ఉంది 2019 నాటి ఓటర్ల వివరాలు, 2024 నాటి వివరాలు. మధ్యలో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు కానీ 2019 నాటి జాబితాలతోనే నిర్వహించారు (ఈ ఎన్నికల గురించి హై కోర్ట్ లో 7 కేసులు, సుప్రీం కోర్ట్ లో 2 కేసులు నడిచాయి). ఇక 2014 ఎన్నికలు ఉమ్మడి ఎన్నికలు కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోలేము. కాబట్టి మనకి 2019, 2024 నాటి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
మేక్రో లెవెల్ లో చూసుకుంటే 2019 ఎన్నికలు అప్పుడు రాష్ట్రంలో 39405967 ఓటర్లు ఉండగా, 2024 నాటికి 41401887 ఓటర్లు ఉన్నారు. అంటే సంవత్సరానికి 1% శాతం చొప్పున ఓటర్లు పెరిగారు. ఇది చాలా సహజం. 2021లో ఓటర్ల జాబితా అప్డేట్ చేసినప్పుడు 40441378 ఓటర్లు ఉన్నారు. అంటే 2019 నుండి 2021 మధ్య సంవత్సరానికి 1.3% పెరిగారు. అలాగే 2021 నుండి 2024 మధ్య సంవత్సరానికి 0.8% పెరిగారు. పైన పేర్కొన్న 1% పెరుగుదలకి ఇవి సరితూలతాయి. పైన పేర్కొన్న కర్ణాటక, మహారాష్ట్ర సంఖ్యలతో పోల్చుకుంటే ఇవి ఏమైనా తూగుతాయా అసలకి?
ఇక మైక్రో స్థాయిలో చూద్దాం. 2019 నుండి 2024 మధ్య మొత్తం 175 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్య తగ్గగా, 167 నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్య పెరిగింది. అన్నిటికనా ఎక్కువుగా పెరిగింది భీమిలిలో. 57160 ఓటర్లు పెరిగారు. అంటే సంవత్సరానికి 3.7% పెరిగారు. అన్నిటికన్నా ఎక్కువ తగ్గింది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో. 22713 మంది ఓటర్లు తగ్గారు. అంటే సంవత్సరానికి 1.9%.
ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో మారిన ఓటర్ల సంఖ్య కంటే గెలిచిన అభ్యర్ధికి వచ్చిన మార్జిన్ తక్కువైతే ఆ మారిన ఓటర్ల సంఖ్య ఈ గెలుపోటములని ప్రభావితం చేసింది, అందుకే అలా అవ్వాలని ఓటర్లని చేర్చారనో, తీసేశారనో ఆధారం లేని ఒక వాదన తీసుకురావచ్చు. ఇది వాస్తవమేమి కాదు కానీ, ఫర్ ది సేక్ ఆఫ్ఆర్గ్యుమెంట్ అనుకుందాం. ఇప్పుడు 2024 ఎన్నికలలో ఏమయ్యిందో చూద్దాం. మొత్తం 175 నియోజకవర్గాలలో తెలుగుదేశం 135, జనసేన 21, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 11, భారతీయ జనతా పార్టీ 8 గెలిచాయి. 34 చోట్ల మారిన ఓటర్ల సంఖ్య కంటే గెలిచిన అభ్యర్ధికి వచ్చిన మార్జిన్ తక్కువైంది. వైసిపి గెలిచిన 11 చోట్లలో 8 చోట్ల అక్కడ మారిన ఓటర్ల సంఖ్య కంటే అభ్యర్ధి మార్జిన్ తక్కువ. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ 8లో 6 రాయలసీమలోనే. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే గెలిచిన 135లో 22 చోట్ల అలా జరిగింది. జన సేన, బిజెపి విషయంలో అలా చెరో 2 చోట్ల జరిగింది. దీన్ని శాతాలలో చెప్పుకుంటే వైసిపి విషయంలో 73% నియోజకవర్గాలలో ఇలా జరుగగా, బిజెపి విషయంలో 25 % చోట్ల, తెలుగుదేశం విషయంలో 16 % చోట్ల, జనసేన విషయంలో 9% చోట్ల ఇలా జరిగింది. ఈ సంఖ్యలు చూసుకుంటే దాని నుండి ఎవరు లాభపడినట్టు?
ఈ సంఖ్యలు, వాస్తవాలు ఇలా ఉండగా రాహుల్ గాంధీ మాట్లాడట్లేదు, అరవట్లేదు అని అనడం ఎందుకు? అభాసుపాలు కావడం ఎందుకు?
Comments
Post a Comment