Can't we stop the intellectual destruction of Telangana? తెలంగాణ మేధో విధ్వంసాన్ని ఆపలేమా?

 తెలంగాణ మేధో విధ్వంసాన్ని ఆపలేమా?

కాసుల ప్రతాపరెడ్డి


తెలంగాణ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. పాలక పార్టీల తీరు వల్ల తెలంగాణలో గుణాత్మకమైన మార్పునకు ఏ మాత్రం అవకాశాలు లేకుండాపోయాయి. పదేళ్ల పాటు పాలించిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌), తర్వాతి బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ ఆత్మగౌరవం అనేది పాలక వర్గాల ఆత్మగౌరవమే అయింది. అభివృద్ధి పాలక వర్గాల అభివృద్ధి మాత్రమే అయింది. కాళేశ్వరం గురించి ఎంత చెప్పుకున్నా, దాన్ని ఎంత సమర్థించాలని చూసినా లోపాలను దాచలేని పరిస్థితి వచ్చింది. ఆ లోపాలు ఎందువల్ల చోటు చేసుకున్నాయనే విషయాన్ని కూడా దాచపెట్టలేని స్థితి వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అంతకన్నా మెరుగ్గా ఏమైనా చేస్తుందా అంటే ఆశలు సన్నగిల్లడం ప్రారంభమైంది. 

 భౌగోళిక తెలంగాణ తర్వాత సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడాలనే ఆకాంక్షలను పక్కన పెడుదాం. కేసీఆర్‌ బంగారు తెలంగాణ చేస్తానని హామీ ఇచ్చారు. అదీ మరిచిపోదాం. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారిలో కొంత మందికి పదవులు ఇచ్చారు. కానీ స్వేచ్ఛగా పనిచేసే అవకాశం వారికి లేకుండా పోయింది. వారిలో కొంత మంది తీవ్రమైన నిరాశతోనే పదవుల్లో కొనసాగారు. కానీ, వారు తెలంగాణ మొత్తానికి కాకుండా కేసీఆర్‌కు అనుకూలంగా మాత్రమే పనిచేశారు, చేస్తున్నారు. కేసీఆర్‌ రాజకీయాల్లో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారికి పెద్ద పీట వేయడం వల్ల తీవ్రమైన నష్టం వాటిల్లింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, అందులో చురుకైన పాత్ర నిర్వహించిన రాజకీయ నాయకుల ప్రయోజనాలు కూడా తీసికట్టుగానే ఉన్నాయి. కేసీఆర్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ కన్నా మెరుగ్గా పనిచేస్తున్నదా అనే ప్రశ్న వేసుకుంటే లేదనే సమాధానమే వస్తున్నది. 

 కేసీఆర్‌ను తీవ్రంగా దూషించిన కవులకు, ఇప్పటికీ కేసీఆర్‌ పక్కనే ఉన్న కొంత మంది కవులకు, రచయితలకు, బుద్ధిజీవులకు రేవంత్‌ రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారు, ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ఏ మాత్రం నిబద్ధత, నిజాయితీ, తెలంగాణ పట్ల ప్రేమ లేనివారికి కూడా కాంగ్రెస్‌ పాలనలో పదవులు లభించాయి. ఇది పెద్ద ప్రమాదంగా పరిణమించింది. ఉదాహరణకు ` ఒక కమిషన్‌లో ఓ జర్నలిస్టును సభ్యుడిగా వేశారు. ఆ సభ్యుడు తెలంగాణ సమాజానికి, తన సమూహానికి మేలు జరిగే పనుల గురించి, కార్యాచరణ గురించి ఏం ఆలోచిస్తున్నాడో, అందుకు ఏం చేస్తున్నాడో తెలియదు గానీ ప్రజలకు మాత్రం కంటకప్రాయంగా మారాడు. ఆ పదవి హుందాతనాన్ని కూడా తుంగలో తొక్కి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తన అఫిషియల్‌ లెటర్‌ హెడ్‌ మీద స్వప్రయోజనాల కోసం ఇతరులపై ఫిర్యాదు కూడా చేశాడు. తన స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి పేరును కూడా వాడుకుంటున్నాడు. తోటి జర్నలిస్టులపై రాయడానికి వీలుకాని బూతులు ప్రయోగిస్తున్నాడు. ఇతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రెస్‌కు సంబంధించిన ఒక ఉన్నతమైన పదవిని చేపట్టాడు. ఇటువంటి వ్యక్తులు ఇంకా ఉండవచ్చు. అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తుల వల్ల తెలంగాణకు మేలు జరగడం అటుంచి, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినే పరిస్థితి దాపురించింది. 

 అంతేకాకుండా, వివిధ రంగాలపై దృష్టి సారించడానికి రేవంత్‌ రెడ్డికి సమయం సరిపోవడం లేదా అనే అనుమానం కూడా వస్తున్నది. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ పదవిని భర్తీ చేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో తెలియదు. దాని ప్రయోజనాన్ని ఆయన తక్కువ అంచనా వేస్తూ ఉండవచ్చు. కానీ అది నిర్వహించే పాత్ర చాలా ఉంటుంది. అంతేకాదు, తెలుగు అకాడమీకి పూర్తి స్థాయి డైరెక్టర్‌ను వేయకపోవడం మాత్రం తీవ్రమైన నష్టమే కలిగిస్తున్నది. విద్య పట్ల కేసీఆర్‌కు ఉన్న ఆలోచనే రేవంత్‌ రెడ్డికి ఉందా అనే సందేహం కలుగుతున్నది. తెలుగు అకాడమీ నిర్వహించిన, నిర్వహిస్తున్న పాత్ర చూస్తే దాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అది క్రమంగా దెబ్బ తింటూ వస్తున్నది. అధికార భాషా సంఘం చైర్మన్‌ పదవి కూడా ఇంకా ఖాళీగానే ఉన్నట్లుంది. తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నవారికి, తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నవారికి ఆ పదవులు ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందనే విషయాన్ని రేవంత్‌ రెడ్డి విస్మరిస్తున్నట్లే కనిపిస్తున్నారు. 

 కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను, ఫార్ములా ఈ ` రేస్‌ విషయంలో కేటీఆర్‌ను ఆయన చిక్కుల్లోకి తోశారు. తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాల్సిందే. కాదనలేం. అదే సమయంలో తెలంగాణ సమాజానికి ఏం కావాలనే విషయాన్ని చాలా తీవ్రంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కేసీఆర్‌ను సమర్థిస్తున్న బుద్దిజీవులు బలంగానే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చడానికి శ్రీధర్‌రావు దేశ్‌ పాండే ఓ పుస్తకమే రాశారు. స్థానికంగా ఓ ఆంగ్ల దినపత్రికలో పనిచేసిన సీనియర్‌ జర్నలిస్టు రాసిన పుస్తకం చదివితే శ్రీధర్‌ దేశ్‌పాండే వాదనలో ఏ విధమైన పస లేదని తేలిపోతుంది. కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేస్తున్న బుద్దిజీవుల చర్యలను తిప్పికొట్టే పని కాంగ్రెస్‌ వైపు నుంచి జరగడం లేదు. భవిష్యత్తులో ఇది కాంగ్రెస్‌కు నష్టం చేస్తుంది. తెలంగాణ సమాజాన్ని తన వైపు తిప్పుకునేందుకు కేసీఆర్‌ అనుకూల వర్గం చేస్తున్న వాదనలను తిప్పికొట్టే యంత్రాంగాన్ని రేవంత్‌ రెడ్డి ఇప్పటికీ రూపొందించుకోలేకపోతున్నారు. 

 తెలంగాణలోని బుద్దిజీవులు (కవులు, రచయితలు కూడా ఈ కోవలోకే వస్తారు) తెలంగాణ పట్ల నిబద్దతను, నిజాయితీని చాలా వరకు కోల్పోయారు. ఇంతకు ముందు తెలంగాణలో ఇటువంటి పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఉన్న వీళ్లు సమాజంలో గుణాత్మకమైన మార్పునకు దోహదం చేస్తూ ఉండేవారు. పాలకవర్గాలు చేసే అన్యాయాలను ఖండిరచడంలో, వాటిని ఎదుర్కోవడంలో ముందు ఉండేవారు. ఆ పాయ చాలా వరకు బలహీనపడిరది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు గొంతును ఇచ్చిన బుద్ధిజీవులు చాలా వరకు పాలకవర్గంలో కలిసిపోయారు. అటు బీఆర్‌ఎస్‌ వైపో, ఇటు కాంగ్రెస్‌ వైపో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఆంధ్ర ప్రాంతంలో 1964లో సంభవించిన పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో సంభవిస్తున్నట్లు అనిపిస్తున్నది. సిపిఐ రెండుగా చీలిపోయి నెహ్రూ సోషలిజాన్ని కౌగలించుకున్న తర్వాత కవులు, రచయితలు, కళాకారులు చాలా వరకు సినిమా రంగానికి, ప్రచురణ రంగానికి వెళ్లారు. భూస్వాములకు, కూలీలకు మధ్య రాజీ కుదిర్చే, పారిశ్రామికవేత్తలకూ కార్మికులకూ మధ్య సయోధ్య కుదిర్చే భావజాలంతో వచ్చిన పలు సినిమాలకు పనిచేస్తూ వెళ్లారు. తెలంగాణలోని రచయితలు, కవులు, కళాకారులు కూడా పాలకవర్గాల్లో చేరిపోయే దశ ఇప్పుడు వచ్చింది. స్వార్థప్రయోజనాల కోసం అని అనలేం గానీ వ్యక్తిగత ప్రయోజనం చాలా మందికి ప్రధానమైపోయింది. సైద్ధాంతిక నిబద్ధత ఉత్తి డొల్లపదంగా మారిపోయింది. దీన్ని పాలకపార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. 

 మరోవైపు, ప్రత్యామ్నాయ రాజకీయాలు చాలా వరకు బలహీనపడ్డాయి. వాటికి అనుబంధంగా పనిచేసే ప్రజా సంఘాలు కూడా అంత బలంగా లేవు. ఈ రాజకీయాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిరది. ఇప్పటికీ విప్లవ సిద్ధాంతానికి కట్టుబడి మాట్లాడుతున్నవారిలో కొంత మంది (అందరూ కాదు) వైరుధ్యాల మధ్య జీవిస్తున్నారు. సంపాదన తెచ్చిపెట్టే సౌకర్యాలను మాత్రమే కాదు, దానివల్ల ఒనగూరే గౌరవాన్ని కూడా పొందుతూ మరోవైపు విప్లవ రాజకీయాల ప్రవక్తలుగా పనిచేస్తున్నారు (మరోసారి అదే మాట ` అందరూ కాదు). విప్లవ రాజకీయాల వైపు ఉంటే చాలు, వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా ఫరవాలేదనే ధీమా వారిలో ఏర్పడిరది. ఎందుకంటే, వారు రెండు వైపుల నుంచి గౌరవం పొందగలుగుతున్నారు. సంపాదనపై దృష్టి పెట్టకుండా నిజాయితీగా నిలబడిన వ్యక్తులకు సమాజంలోనే కాదు, బుద్ధిజీవుల్లోనూ గౌరవం లేకుండా పోతున్నది. అందువల్ల ఇటువంటి కవులూ రచయితలూ కళాకారులూ నిస్సహాయమైన స్థితిలోకి జారిపోతున్నారు. బహుశా, పాలకవర్గాలకు కావాల్సింది కూడా అదేనేమో. పాలకవర్గాల ప్రయోజనాలు నెరవేర్చే పాత్రను మనం చాలా సమర్థంగా నిర్వహిస్తున్నామని చెప్పడానికి మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణను విధ్వంసం వైపు నడిపిస్తుండడం అనుభవంలోకి వస్తున్నదే.

Comments

Popular posts from this blog

Chenchulu of Nallamala

Gujarati financial influence on the Indian economy

Row over CPI(M) not calling Modi govt ‘fascist’; Vijayan eyeing ‘BJP vote’: Cong