Minority Declaration in Telangana.
మైనారిటీ డిక్లరేషన్ ఏమైంది?
2023లో తెలంగాణ రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఏర్పడిన ప్రభుత్వం గత బీఆర్ఎస్ కు భిన్నంగా తమ ఆశలు, ఆశయాలు తీరుస్తుందని బలంగా నమ్మారు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు.
2023 జూన్ 20న హైదరాబాద్ లోని మదీనా ఎడ్యూకేషన్ సెంటర్లో రాష్ట్రంలోని ముస్లిం మేధావులు మేధో మధనం జరిపి తెలంగాణ రాష్ట్ర ముస్లింల తక్షణావసరాలను గుర్తించి ఒక డిక్లరేషన్ ను రూపొందించారు. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం, 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం రూపొందించిన డిక్లరేషన్ యిది. మొత్తం 22 అంశాలతో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో దీన్ని రూపొందించి, ప్రచారంలోకి పెట్టారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేకానేక ముఖ్య నగరాల్లో, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి, ముస్లిం సంఘాల జేఏసీ రూపొందించి ముస్లిం డిక్లరేషన్ ను చర్చకు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం డిక్లరేషన్ లోని అనేక అంశాలను తీసుకొని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిటీ విధానాన్ని చేరుస్తూ మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేసింది.
కాని కాంగ్రెస్ పార్టీ మాటలకు, చేతలకు పొంతన లేని తీరును ప్రస్తుతం మనం గమనించవచ్చు. 2023 శాసనసభ ఎన్నికలలో ముస్లింలకు టికెట్లు కేటాయించడంలోనే తన చిన్నచూపును చాటింది. 2021 జనాభా లెక్కల ప్రకారం చూసినా, అధికారంలోకి వచ్చాక చేపట్టిన సర్వేను గమనించినా తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా 12 శాతానికి మించి ఉంది. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు 14 స్థానాలు శాసనసభలో దక్కాలి. ముస్లింలు తమ డిక్లరేషన్ లో అడిగింది మాత్రం, హైదరాబాద్ పాతబస్తీలో కాకుండా ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ముస్లింలకు రాజకీయ పార్టీలు 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు కేటాయించింది 6 స్థానాలు మాత్రమే. కేటాయించిన స్థానాలను గెలుచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధను కూడా తీసుకున్నట్లు కనిపించదు. ఫలితం సున్నాగా మిగిలింది. మిగిలిన రాజకీయ పక్షాలదీ ఇదే తీరు. బీఆర్ఎస్ 3 స్థానాలను, ఏఐఎంఐఎం 8 స్థానాలను మాత్రమే కేటాయించాయి. బీఆర్ఎస్ కు కూడా సున్నా మిగిలింది. ఏఐఎంఐఎం నుండి 7గురు గెలిచి ప్రస్తుత తెలంగాణ శాసనసభలో 7 మంది ముస్లిం శాసన సభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రస్తుత శాసన సభలో అధికార పార్టీ తరపున ముస్లింల ప్రాతినిధ్యం లేదనే సాకుతో, అధికారంలోకి వచ్చాక ముస్లిం మంత్రులు లేకుండా 20 నెలలుగా పాలన జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి (1992-93) ఎన్టీఆర్ (1983-84) నాదెండ్ల భాస్కర్ రావు (1984) ఎన్. జనార్ధన్ రెడ్డి (1990-92)ల మంత్రి వర్గాల్లో ముస్లింలకు స్థానం దక్కలేదు. ముస్లిం మంత్రులు లేకుండానే వారు తమ పాలనను సాగించారు. ఆ రికార్డును రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో 12 శాతం పైగా జనాభా కలిగి ఉన్నా ముస్లిం మంత్రి లేకుండా పాలన సాగుతుంది.
కనీసం నామినేటెడ్ పోస్టుల్లోనైనా ముస్లింలకు ప్రాతినిధ్యం లభించిన దాఖలాలు లేవు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మహమ్మద్ రియాజ్ కు తప్ప, చాలామంది ముస్లింలకు మొండిచెయ్యే దక్కింది. ఒక రకంగా చెప్పాలంటే, రియాజ్ కున్న అర్హతలకు తగిన ప్రాధాన్యత కూడా లభించలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు నియమించిన రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పోరేషన్లలో కానీ, వివిధ కమిషన్ల నియామకంలో కానీ ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదు. నూతనంగా నియామకం కాబోతున్న ఎమ్మెల్సీ అజహరొద్దీన్ కైనా మంత్రివర్గంలో చోటు దొరుకుతుందో లేదో చూడాలి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తనకు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే సీటును తప్పించి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించారు.
రాష్ట్ర రాజకీయాల్లో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం సంగతలా ఉంచితే, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఇళ్ల స్థలాలుండి, స్వంత ఇళ్లు లేనివారికి, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నందు వల్ల ఈ ప్రతిష్టాత్మక పథకంలో ముస్లింలకు తగు ప్రాతినిధ్యం లభించడం లేదనడంలో సందేహం లేదు. ముస్లిం జనాభాలో 43% మంది ముస్లింలు పట్టణాల్లో అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 12% గ్రామీణ ప్రాంతాల్లో 7% ఇళ్లను ముస్లింలకు కేటాయించాలని గత ప్రభుత్వం ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో 20%, గ్రామీణ ప్రాంతాల్లో 10% ఇళ్లు ముస్లింలకు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుధీర్ కమీషన్ (2016) సూచించింది. ఇళ్ల స్థలాలతో ముడిపడి ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ముస్లింలకు తగు అవకాశం లభించే వీలు లేనందున, ఇళ్ల స్థలాలు లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం మరో పథకాన్ని అమలు చేయవల్సిన అవసరముంది.
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో సచార్ కమిటీ, సుధీర్ కమిటీ నివేదికల్లో పొందుపర్చిన అంశాలను అమలు చేస్తానని వాగ్దానం చేసింది. ఇలా కమిషన్లు, కమిటీల నివేదికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు ముస్లిం రిజర్వేషన్లు అనే అంశానికే కేంద్రీకృతమై, మిగతా అంశాలను పక్కన పడేస్తాయి. సచార్ కమిటీ రిపోర్ట్ సంగతలా ఉంచితే, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిటీ నివేదిక విషయంలోనూ జరిగిందిదే. ముస్లిం రిజర్వేషన్లు పెంచుతూ, అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నది అప్పటి ప్రభుత్వం! నిజానికి సుధీర్ కమిటీ తక్షణం అమలు చేయవల్సినవి, మధ్యకాలిక, దీర్ఘకాలిక సిఫార్సులు అంటూ ఎన్నో సలహాలను, సూచనలను చేసింది. కనీసం వీటిని పట్టించుకున్న దాఖలా లేవీ లేవు.
ముస్లింలు కోరుకుంటున్న అనేక అంశాలను, ఎన్నికల మేనిఫెస్టోలో, మైనారిటీ డిక్లరేషన్ లో పొందుపర్చిన వాటిని, సుధీర్, సచార్ కమిటీ నివేదికలను, అన్నిం టిని కూలంకషంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల ప్రగతికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
వక్స్ బోర్డుకు ప్రత్యేక కమిషనరేట్ ను ఏర్పాటు చేసి, జుడిషియల్ పవర్ కల్పించాలి. అన్ని జిల్లాలకు వక్ఫ్ ఇన్స్ పెక్టర్లను నియమించాలి. రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఎన్నికలకు ముందు ముస్లిం డిక్లరేషన్ లో ముస్లిం మేధావులు కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిటీ డిక్లరేషన్ లో భాగంగా 3వ అంశంగా దీనిని పొందుపర్చారు. వక్ఫ్ బోర్డు జ్యూడిషియల్ పవర్ ను సమకూర్చడంతోపాటు ఇంతవరకు జరిగిన ఆక్రమణలను తొలగిస్తామని కూడా వాగ్దానం చేసింది. ఈ సంగతలా ఉంటే, దేశవ్యాప్తంగా బీజేపీ వక్ఫ్ సవరణ బిల్లును తెస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తన స్పష్టమైన వైఖరినీ వ్యక్త పరచకపోవడం గమనార్హం. ఆ విషయంలో రాష్ట్రంలో ముస్లింలు చేపడుతున్న ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది.
గత 9 సంవత్సరాల తమ పాలనతో తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం మొత్తం 12800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని, రాష్ట్ర బడ్జెట్లో అది 1.9 శాతం మాత్రమేనని, దీనిలో ఖర్చు చేసింది కేవలం 8400 కోట్ల రూపాయలేనని ముస్లిం డిక్లరేషన్లో స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమం కోసం ప్రతి ఏటా 10 వేల కోట్ల రూపాయల నిధులు పెంచాలని, యిలా పెంచినా రాష్ట్ర బడ్జెట్లో అది 4% మాత్రమే అవుతుందని తెలిపారు. ఈ దిశగా అడుగులు వేయావల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అంతేకాకుండా ముస్లింలు కోరుకుంటున్న అనేక అంశాలను, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన వాటిని, సుధీర్, సచార్ కమిటీ నివేదికలను, అన్నింటిని కూలంకషంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల ప్రగతికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
* సయ్యద్ ఖుర్షీద్
రచయిత, సామాజిక విశ్లేషకులు
Comments
Post a Comment